తాళ్ళచెరువు స్థాపనకు పూర్వపు పరిస్థితి :

అది పందొమ్మిదవ శతాబ్ది చివరి దశాబ్దమునకు పూర్వము నిర్మానుష్యము, గుట్టలతోను,ముఖ్యముగ తాటిచెట్లతోను, పొదలతోను, రాళ్ళు, బండలతోను, విశాలమైన ఆకర్షణీయమైన అటవీ ప్రాంతము. ఈ ప్రాంతము గుంటూరు పట్టణమునకు పశ్చిమ, వాయవ్యముగా 70 కిలోమీటర్లు, సత్తెనపల్లికి ఉత్తరముగా 30 కిలోమీటర్లు అచ్చమ్మపేట మండలమునకు పశ్చిమముగ 5 కిలోమీటర్ల దూరములో, ప్రస్తుత పెద్దకూరపాడు నియోజకవర్గములో వున్నది.ఈ ప్రదేశమే ప్రస్తుతము తాళ్ళచెరువు గ్రామమని పిలువబడుతుంది. ఈ గ్రామానికి ప్రత్యేక చరిత్ర వుంది.

తాళ్ళచెరువు నేల అడవి

తెలుగునాట క్రైస్తవం :

అపోస్తులందరు అనేక మంది బోధకులు, మత సంస్థలు సువిశేష బోధకు తమ జీవితాలను ఆంకితము చేసికొని ఈ దైవ కార్యాన్ని కొనసాగించుచున్నారు. ఈ సభలలో ఒకటియైన పునీత లయోల ఇన్నాశినారిచే స్టాసింపబడిన “ఏసుసభ”” అను గురువుల సభ. ఆ సభకు చెందినవారే మన పునీత గోవా శౌరినారు. ఆ సభ సభ్యులే మొట్టమొదట మన తెలుగునాట కాలిడిన వారిలో ముఖ్యులు.

ఫాదరు పియరు మోద్వీ జేసు సభ గురువులు 1701లో చిత్తూరు, జిల్లాలోని పుంగనూరు గ్రామములో తొలి తెలుగు వెలమ స్త్రీకి అమె నలుగురు పిల్లలకు జ్ఞానస్నానమిచ్చినారు. తరువాత సాలె కులానికి చెందిన రంగప్ప అనే అతడు రాయప్పగా జ్ఞానస్నానము పొంది, ఉపదేశిగ కూడ పని చేసినాడు. 1702 సంవత్సరంలో “ఫాదరు లెగాక్‌” అను జేసుసభ గురువుచే అనేక సంవత్సరముల నుండి దీర్ఘ స్వస్థతగాని వ్యాధితో బాధపడుచున్న అధిక సంపన్నుడు, పేరు ప్రతిష్టలుగల తుమ్మా హనుమంతరెడ్డి, రాయప్ప (రంగప్పు ఉపదేశి సలహామేరకు, రెడ్డిగారి కోరికపై సువిశేష బోధితుడుగావింపబడి, తాను తనతోపాటు 15 మంది బంధువులు జ్ఞానస్నానము స్వీకరించిరి. హనుమంతరెడ్డి, రాయపరెడ్డి అని నామ ధేయుడాయెను. తన సుదీర్ఘ వ్యాధి నుండి స్వస్థత పొందెను. వీరిది చిత్తూరు జిల్లాలోని మద్దిగుబ్బ గ్రామము.

వీరి ద్వార తక్కిన రెడ్డి కులస్తులు అలమూరు మొదలైన గ్రామముల నుండి క్రైస్తవము స్వీకరించిరి. సాలి, తొగటీలు, తెలగ కులస్తులు చిన్నబళ్లాపురం, దేవనపల్లి, కృష్ణాపురం, (కడప జిల్లా) సిద్దవట్టం, గ్రామంల నుండి జ్ఞానస్నానము పొందిరి. గాలి అన్నమ్మ అనే తొలి కమ్మ మహిళ, కడపజిల్లా గండికోటస్తురాలు, మతము స్వీకరించింది. ఆమె ద్వారా ఆనేకమంది కమ్మవారు సువార్త బోధితులైరి. ఈవిధముగ తెలుగునాట కైస్తవము అనేక గ్రామములలో అభివృద్ది గాంచింది.

దేవుని ప్రణాళికలో వలసపోవుట గూడ సువార్త ప్రచారములో ఒక భాగమైవున్నది. రాజకీయ కారణములు, కరువు కాటకములవల్ల, మత హింసల కారణముగ ముఖ్యముగ రెడ్లు తమ విశ్వాసాన్ని కాపాడుకొనుటకు అనంతపురం జిల్లాలోని దూపాడు సీమలోని బుక్కాపురం, కొంతమంది ప్రకాశం జిల్లాలోని పెద్ద ఆరెకట్ల, గార్లపాడు వెళ్ళారు. వీరిననుసరించి తక్కిన కులస్తులు కూడ వలస వెళ్ళిరి.

మరల ఇచ్చట 1763వ సంవత్సరములో కొన్ని ఇబ్బందులకు తట్టుకోలేక కొండవీడు ప్రాంతమైన ఫిరంగిపురం, రావిపాడు, ముట్లూరు,శిరిపురం, రావెల, పాటిబండ, రెంటచింతల, తూబాడు, వరగాణి, పొడపాడు, ఓలేరు, 113 తాళ్ళూరు, తురకపాలెం, అత్తులూరు, కొండ్రముట్ల మొదలగు గుంటూరు జిల్లాలోని ప్రాంతాలకు వలస వెళ్ళిరి. అయినను వారి విశ్వాసమును కాపాడుకొంటూ వచ్చిరి. వీరిననుసరించి ఫ్రెంచి, ఐరిష్‌ మిషనరీలు వచ్చుచు వీరిని విశ్వాసమునందు పఠిష్టమొనరించుచుండిరి. అపుడు మద్రాసు మేత్రాసనము క్రింద ఈ ప్రాంతమంతయుండెను. చాలినంత మంది గురువులు లేనందు వలన కథోలికులను తరచు సందర్శించలేక పోయెడివారు

అర్లానందస్వామి భారత దేశం రాక :

కార్డినల్‌వాన్‌ గారు 19-3-1866న ఇంగ్లాండులో మిల్‌హిల్‌ పునీత జోజప్పగారి వేద వ్యాపక గురువుల సంస్థను స్టాపించిరి. మద్రాసు బిషప్పుగారు ఈ సంస్థ గురువులను పిలిపించి 1875 సంవత్సరములో కొంత మంది ఈ గురువులను గుంటూరు ప్రాంతములకు పంపిరి. ఈ సంస్థ గురువులు క్రమేణ ఎక్కువ మంది వచ్చిరి.

అందులో ఒక గురువు John Van Der Westlaken ఆర్లానంద స్వామి అని వీరి జన వాడుక పేరు. జాన్‌ అనగా ఆర్లప్ప లేక ఆర్లానంద అని తమిళములో, తెలుగు లో పిలుతురు. ఇది వారి జ్ఞానస్నాము పేరు. వాన్‌డర్‌ వెష్టలోకెన్‌ అనేది వారి ఇంటి పేరు. వీరు హాలండ్‌ దేశము లోని మైకల్స్‌ పురములో 18-12-1860న ప్రాంచీసు, ఆనీ మరియ అనే పుణ్య దంపతు లకు జన్మించారు.

వీరుతమ సామాన్య విద్యను హాలెండు దేశములో ముగించుకొని గొప్ప వేదబోధకుడు కావాలని “ఎంతో ఆశతో, దైవప్రేమ, సోదర ప్రేమలతో పూరితుడై ఇంగ్లాండ్ లో స్థాపించబడిన మిల్‌హిల్‌ సంస్థలో చేరి గురువిద్య నభ్యసించి 1884లో గురుపట్టము పొంది, హిందూ దేశములోని గుంటూరు ప్రాంతములో పనిచేయుటకు ఉద్యుక్తుడై తయారైనాడు.

తన కోరిక ప్రకారమే పెద్దలు ఆయనను మన దేశానికి పంపటము జరిగింది. వీరు మొదట ఆనంతపూరు జిల్లా గూటిలో 1887 నుండి 1889 వరకు, తరువాత 1890లో ఫిరంగిపురంలోను, 1891లో పాటిబండ్లలోను, 1892 నుండి 1904 వరకు సిరిపురంలోను పనిచేసినారు. సిరిపురంలో పనిచేస్తూ తాళ్ళచెరువు గ్రామస్థాపనకు కారకులైనారు. కాబట్టి వీరు తాళ్ళచెరువు గ్రామ వ్యవస్థాపకులైనారు. సిరిపురం విచారణ చేస్తూ ఎక్కువ కాలం తాళ్ళచెరువు లోనే వుండేవారు

(రెండవ భాగం….)

Source : From the book of “మా ఊరు తాళ్ళచెరువు” in 1996 by ఫాదర్ ఏరువ ఇన్నయ్య