Home

తాళ్ళచెరువు గ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని అచ్చమ్మపేట మండలంలోని ఒక గ్రామం. ఈ గ్రామంలో సుమారు 6000 మంది నివసిస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు రోమన్ కాథలిక్ సమాజానికి చెందినవారు. ఈ గ్రామం చుట్టూ మూడు వైపులా కొండలు , తూర్పు వైపు నది ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా మిరప, పత్తి సాగు చేస్తారు.

"తాళ్ళచెరువు" చరిత్ర :

అది పందొమ్మిదవ శతాబ్ది చివరి దశాబ్దమునకు పూర్వము నిర్మానుష్యము, గుట్టలతోను,ముఖ్యముగ తాటిచెట్లతోను, పొదలతోను, రాళ్ళు, బండలతోను, విశాలమైన ఆకర్షణీయమైన అటవీ ప్రాంతము. ఈ ప్రాంతము గుంటూరు పట్టణమునకు పశ్చిమ, వాయవ్యముగా 70 కిలోమీటర్లు, సత్తెనపల్లికి ఉత్తరముగా 30 కిలోమీటర్లు అచ్చమ్మపేట మండలమునకు పశ్చిమముగ 5 కిలోమీటర్ల దూరములో, ప్రస్తుత పెద్దకూరపాడు నియోజకవర్గములో వున్నది.ఈ ప్రదేశమే ప్రస్తుతము తాళ్ళచెరువు గ్రామమని పిలువబడుతుంది. ఈ గ్రామానికి ప్రత్యేక చరిత్ర వుంది.

కార్డినల్‌వాన్‌ గారు 19-3-1866న ఇంగ్లాండులో మిల్‌హిల్‌ పునీత జోజప్పగారి వేద వ్యాపక గురువుల సంస్థను స్టాపించిరి. మద్రాసు బిషప్పుగారు ఈ సంస్థ గురువులను పిలిపించి 1875 సంవత్సరములో కొంత మంది ఈ గురువులను గుంటూరు ప్రాంతములకు పంపిరి. ఈ సంస్థ గురువులు క్రమేణ ఎక్కువ మంది వచ్చిరి. అందులో ఒక గురువు John Van Der Westlaken ఆర్లానంద స్వామి అని వీరి జన వాడుక పేరు. జాన్‌ అనగా ఆర్లప్ప లేక ఆర్లానంద అని తమిళములో, తెలుగు లో పిలుతురు. ఇది వారి జ్ఞానస్నాము పేరు. వాన్‌ డర్‌ వెష్టలోకెన్‌ అనేది వారి ఇంటి పేరు. వీరు హాలండ్‌ దేశము లోని మైకల్స్‌లో 18-12-1860న ప్రాంచీసు, ఆనీ మరియ అనే పుణ్య దంపతు లకు జన్మించారు. వీరుతమ సామాన్య విద్యను హాలెండు దేశములో ముగించుకొని గొప్ప వేదబోధకుడు కావాలని "ఎంతో ఆశతో, దైవప్రేమ, సోదర ప్రేమలతో పూరితుడై ఇంగ్లాండ్ లో స్థాపించబడిన మిల్‌హిల్‌ సంస్థలో చేరి గురువిద్య నభ్యసించి 1884లో గురుపట్టము పొంది, హిందూ దేశములోని గుంటూరు ప్రాంతములో పనిచేయుటకు ఉద్యుక్తుడై తయారైనాడు. తన కోరిక ప్రకారమే పెద్దలు ఆయనను మన దేశానికి పంపటము జరిగింది. వీరు మొదట ఆనంతపూరు జిల్లా గూటిలో 1887 నుండి 1889 వరకు, తరువాత 1890లో ఫిరంగిపురంలోను, 1891లో పాటిబండ్లలోను, 1892 నుండి 1904 వరకు సిరిపురంలోను పనిచేసినారు. సిరిపురంలో పనిచేస్తూ తాళ్ళచెరువు గ్రామస్థాపనకు కారకులైనారు. కాబట్టి వీరు తాళ్ళచెరువు గ్రామ వ్యవస్థాపకులైనారు. సిరిపురం విచారణ చేస్తూ ఎక్కువ కాలం తాళ్ళచెరువు లోనే వుండేవారు.

Fr. Alulananda Swamy
Fr. Alulananda Swamy

అర్లానందస్వామి సిరిపురం విచారణ చేస్తూ తమ విశ్వాసాన్ని కాపాడుకొనుటకు వలస వచ్చిన కథోలికుల ఆర్ధిక పరిస్థితి ఆస్థవ్యస్థముగ వుండుట గమనించి జాలివేసి వారికి సహాయము చేయ ఒక నిర్ణయం తో, అటవీ ప్రదేశమును సందర్శించి, పథకం వేసికొన్నారు. ఆకాలములో ఈ ప్రదేశము మద్రాసు రాష్ట్ర మేత్రాసనములో వుంది. అర్లానందస్వామి పథకం ప్రకారము మద్రాసు వెళ్ళి తమ పలుకుబడిని ఉపయోగించి అనేక సాధక, బాధలకు గురై ఈ నిర్మానుష్యమైన అటని ప్రాంతాన్ని పేద ప్రజలకు వ్యవసాయ భూమిగ ప్రభుత్వ అనుమతి మంజూరు చేయించుకొని వచ్చినారు.

ఈ ఆహ్వానాన్ని విన్న అనేక కథోలిక, కథోలికేతర కుటుంబములు తరలివచ్చి గుడిసెలు, గుడారములు వేసుకొనిరి. అర్జానందస్వాములవారు కూడ ఒక గుడారము వేసికొని అక్కడే వుంటూ వారికి అండగ ధైర్యము చెప్పుచు ప్రోత్సాహపరచు చుండెడివారు. తొలుత వచ్చిన వారిలో 40 కుటుంబములవారు సాలి, తొగటి, ఫిరంగిపురం, కొండ్రముట్ల నుండి, 6 కమ్మ కుటుంబములవారు తురకపాలెం నుండి 12 కుటుంబాల రెడ్లు, రావెల, సిరిపురం, పాటిబండల నుండి వచ్చిరి. ఇంకను కొన్ని హిందూ కుటుంబముల వారు కూడ వచ్చి చేరిరి.

ఈ భూమి చెట్టు, గుట్టలతోను, రాళ్ళు, పొదలు, బండలతో కూడిన అడవి కాబట్టి దీనిని సాగులోనికి వ్యవసాయ భూమిగ మార్చుటకు అమితశ్రమ చేయవలసి వచ్చెను. ఎప్పుడు సేద్యము, చేయని ఆభూమిని అన్ని ఆటంకాలు తొలగించి సాగులోనికి తీసికొని వచ్చుట ఊహించినంత తేలిక పని కాదాయెను. రాత్రింబవళ్ళు కష్టించి పని చేయవలసి వచ్చెను.

ఈ క్రొత్త ప్రదేశములో నివసించు స్థలము పేరు తాళ్ళచెరువు గ్రామమని నామకరణము గావించబడినది. ఎందుకనగా ఈ ప్రదేశములో చాల కిక్కిరిసి, ఒత్తుగ, దట్టముగ తాటి చెట్టులు ముఖ్యముగ పడమటి కొండ ప్రాంతములోనున్న (తాటి ) చెరువునందు వుండేవట. బాగా వెడల్పుగ కొమ్ములున్న గేదె సహితము దూరలేనంత మెండుగ తాటిచెట్టు వుండేవట,ఈ కారణముచేత ఈ గ్రామమునకు తాళ్ళచెరువు అని నామమొసగ బడినది. అంత విరివిగ తాటిచెట్టులు వుండుట వలననే కాబోలు మొదట వచ్చినవారు అడవిలో వాసాలు కొట్టి తాటి ఆకుల కప్పుతో తేలికగ గుడిసలు వేసుకోగలిగినారు. తరువాత ; పాటిమట్టితో మిద్దెలు వేసికొనప్పుడుకూడ తాటి కడ్డీలు, దూలాలు వుపయోగించినారు.ఈ గ్రామము అర్జానందస్వామి అంచనా (ప్లాన్ ) ప్రకారము కటబడింది. విశాలమైన ఇండ్ల స్థలాలు, బజారులు, ఎక్కడ చూచిన నాలుగు బజారుల కలయిక, ఒక కూడలిగ అందముగా కనిపిస్తుంది.

తాళ్ళచెరువు గ్రామము నిర్మింపబడక పూర్వము నుండే దానికి ఉత్తర ప్రక్కన మూడు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి అనే గ్రామముంది. ఆ గ్రామములొనే మనసబ్‌, కర్ణాలు, , అనగా రెవిన్యూ అధికార్డు వుండేవారు, ఆ కొత్తపల్లి గ్రామ శివారు క్రింద చేర్చబడింది. ఈ నూతన తాళ్ళచెరువు (గ్రామము. అర్జానందస్యామి దానికి సమ్మతించక మద్రాసు వెళ్ళి తాళ్ళచెరువు శివారు క్రింద క్రొత్తపల్లి గ్రామాన్ని మార్చించినారు. తాళ్ళచెరువు (న్ధాపింపబడిన తేది ఎచ్చట ఆచూకి దొరకలేదు.

అర్జానందస్వామి పిలుపు నందుకొని తమ స్వగ్రామాలను, బంధువులను వదులుకొని ఈ నూతన ప్రదేశానికి ఎంతో ఆశతో వచ్చిన పేద కథోలికులు అనేక సమస్యలను, కష్టాలను ఎదుర్కొని, శ్రమించి పని చేయాల్సి వచ్చింది. ప్రజలు ఊహించినంత తేలికగ ఏమి జరుగలేదు. ఈ పేదలు ఈ భూములను సాగుచేసుకొనుట, పశు సంపదను పొందుట ఇరుగు పొరుగు వారికి అసూయ కలుగచేసినది.
ఈ నూతన ప్రదేశానికి వచ్చిన పేద కథోలికులతో ఎవడు ఎల్లప్పుడు అండదండగ నిలబడి అర్జానందస్వామి నాయకత్వములో తన ప్రణాళికలో తన యందు విశ్యాసముంచిన ఈ పేద కథోలికులకు సహాయముగా నిలిచారు. సాదిoచారు.

తాళ్ళచెరువు చుట్టూ దక్షిణాన క్రోసూరు మండలం, తూర్పు వైపు చందర్‌లపాడు మండలం, దక్షిణం వైపు బెల్లంకొండ మండలం, ఉత్తరం వైపు మెల్లా చెర్వు మండలం ఉన్నాయి. తాళ్ళచెరువు సమీప నగరాలు సత్తెనపల్లి, గుంటూరు,నరసారావు పేట, విజయవాడ

తాళ్ళచెరువు 2011 జనాభా లెక్కల వివరాలు
తాళ్ళచెరువు స్థానిక భాష తెలుగు. తాళ్ళచెరువు గ్రామం మొత్తం జనాభా 6213, ఇళ్ల సంఖ్య 1752. స్త్రీ జనాభా 49.3%. గ్రామ అక్షరాస్యత రేటు 50.3%, స్త్రీ అక్షరాస్యత రేటు 21.6%.

ఆసక్తికరమైన నిజాలు

  • తాళ్ళచెరువు గ్రామం సుమారుగా 1890 లో కనుగొనబడింది
  • ఈ గ్రామం చుట్టూ మూడు వైపులా కొండలు , తూర్పు వైపు నది ఉన్నాయి
  • ఎక్కువ మంది ప్రజలు రోమన్ కాథలిక్ సమాజానికి చెందినవారు
  • తాళ్ళచెరువు బాల యేసు దేవాలయం 1952 సంవత్సరంలో నిర్మించబడింది
  • గ్రామంలో నివసిస్తున్న వారి సంఖ్య సుమారు 6000
  • తాళ్ళచెరువు గ్రామంలో మాట్లాడే ప్రాథమిక భాష తెలుగు
  • ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు గ్రామస్తులు వ్యాప్తి చెందుతున్నారు
  • ఇక్కడ ప్రజలు ఎక్కువగా మిరప, పత్తి సాగు చేస్తారు.